ఇదొక జీవనరాగం. విశ్వవిఖ్యాత కర్నాటక సంగీత విద్వాంసురాలు శ్రీమతి ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి జీవితం ఆధారంగా శ్రీమతి పల్లవి రచించిన నవల. ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి తొలిదశలో చలనచిత్ర నటిగా మీరా వంటి చిత్రాలలో నటించింది. తర్వాత సదాశివంతో వివాహమై జీవితంలో స్థిరపడిన తర్వాత కచ్చేరీలకే పరిమితమైంది. ఆమె కేవలం గాయని మాత్రమే కాదు, మానవీయమైన సుగుణసంపత్తి గల వ్యక్తి – పారగాన్ ఆఫ్ వర్చూస్ అంటారు. ఒక సంగీత సామ్రాజ్ఞి జీవితాన్ని హృద్యంగా వచన కథాకావ్యంగా తీసుకుని రావడం కష్టతరమైన పనియే. ఎందుకంటే ఇందులో కల్పనకు తావులేదు. ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. అందులోని సాధక బాధకాలు రచయిత్రికే తెలుసు.
పల్లవి లోగడ మహానటి సావిత్రి జీవిత చరిత్రను రచించింది. పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆరేడు ముద్రణలకు నోచుకుంది. అందులో కథ ‘చిత్ర’ విచిత్ర గతులతో నడుస్తుంది. ఇందులో అలా ఉండదు. ఇదొక గాంధర్వలోకం. రచయిత్రి ప్రతిభా విశేషముతోనే కథాకథనం రాణించాలి. అందులో ఈమె కృతార్థురాలయింది. అందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. సుబ్బలక్ష్మి రాగము, సదాశివం తానం, రచయిత్రి పల్లవి. మధ్యలో నా అనుపల్లవి అవసరం లేదు. అయినా ఆమె కోరికను కాదనలేక ఈ నాలుగు మాటలు రాశాను. సుబ్బలక్ష్మిగారి జీవితంపై వచ్చిన సమగ్ర ప్రామాణిక పరిశోధనా గ్రంథం ఇది.
– ముదిగొండ శివప్రసాద్